Storie

Posted: November 19, 2010 in Uncategorized

అమావాస్య అర్ధరాత్రి
చీకటి ఏ వస్తువునూ చూపదు. అలా అని, ఏ నిజాన్నీ దాచదు. పున్నమినాటి వెన్నెల్లో తీయని ప్రేమగీతం ఉంది. అమావాస్య చీకట్లో చేదైన విరహగీతం ఉంది. ఆ గీతం చెప్పిన నిజమే ‘అమావాస్య’! సముద్రంలో ఉన్నట్లే మనిషి శరీరంలో కూడా నీరు ఉంటుంది. సముద్రంలో ఉన్నట్లే మనిషి జీవితంలోనూ ఆటుపోట్లు ఉంటాయి. చంద్రుడు సముద్రం మీద ప్రభావం చూపినట్లే మనిషి రక్తం మీద కూడా ప్రభావం చూపుతాడు. తాను లేకుండా పోయి ‘అమావాస్య’ ను సృష్టిస్తాడు. ఆ చీకటిరోజుల్లో మనిషి ఎదుర్కొనే విచిత్రభయానకమైన అనుభవాలు ఏమిటి? శాస్ర్తీయ పునాదుల మీద నిలబడని ఆ బలమైన వాస్తవాలు ఎలాంటివి?

ఇది కొన్ని యదార్థాల నుంచి అల్లుకున్న కాల్పనిక కథ అనుకోండి. లేదా కాల్పనికత నుంచి అల్లిన యదార్థ భ్రమజనిత కథగా నమ్మండి. మీ ఇష్టం. కొన్ని సంవత్సరాల క్రితం లంకపాలెం (ఊరి పేరు మార్చలేదు) అనే గ్రామంలో ఏం జరిగిందో తెలుసా?
ఆ రాత్రి… మిగిలిన రాత్రుల వలే లేదు. ఏ దిక్కు చూసినా కాటుకలాంటి నలుపే ఎదురొస్తోంది. చిటపట చినుకులు ఎండు ఆకుల మీద వింతగా శబ్దిస్తున్నాయి. ఊరు గురక పెడుతోంది. కుక్క మొరగడానికి ఎందుకో సంశయిస్తోంది. పరిసరాలను భయభయంగా చూస్తోంది. చినుకుల శబ్దం ఆగిపోవడంతో భారమైన నిశ్శబ్దం అణువణువూ అల్లుకొని ఉంది. ఇళ్లలో పడుకుని ఉన్న వాళ్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బయటికి స్పష్టంగా వినిపించే ఆ నిశ్శబ్దంలో…
ఒకానొక భయానకమైన కేక!

వో….
రా…..రా
వో….లే….రా
తూర్పున ఉన్న నాగభూషణం (పేరు మార్చలేదు) ఇంట్లో నుంచి వినిపించింది.
ఊరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
ఏం జరిగింది? ఏం జరుగుతోంది? తెలుసుకోవడానికి అందరూ బయటికి వచ్చారు. కేకలు వినిపిస్తున్న ఇంటివైపు పరుగెత్తారు. స్ర్తీల కంఠాలు మృదువుగా ఉంటాయి. కన్నీళ్లల్లో, నవ్వులలో కూడా! కాని కేకలు వేసే ఆ స్ర్తీ కంఠంలో మృదుత్వం ఎక్కడా లేదు. రాత్రి ఒంటిగంట సమయంలో శ్మశానంలో కాలుతున్న శవాలను చూస్తూ నిశ్చింతగా పడుకునే వారు కూడా జడిసి పారిపోయే కేకలవి. జనాలందరూ ఆ ఇంటి తలుపులు దబదబా బాదారు. నాగభూషణం తలుపు తెరిచాడు. అతని కొడుకు, మొన్ననే కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు వెంకటేశ్వర్లు మెడ వాల్చేసి దీనంగా చూస్తున్నాడు.

‘‘ఏమిటయ్యా… మీ ఇంట్లో నుంచి కేకలు వినిపిస్తున్నాయి’’ – పెద్దమనిషి ఎవరో అడిగారు.
‘‘మా కోడలుపిల్ల అరుపులు… ఏం జరిగిందమ్మా అంటే ఏమీ చెప్పడం లేదు. పిచ్చి పిచ్చిగా చూస్తోంది. గంట నుంచి వో….రా….వో…. అనే అరుస్తోంది. ఏం చేయాలో తెలియడం లేదు’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు నాగభూషణం. ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఒక ముసలాయన మాత్రం తన తెల్లగడ్డాన్ని నిమురుకుంటూ ‘‘ఈరోజు అమావాస్య కదా. అలాగే ఉంటుంది’’ అన్నాడు. ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి చాలా మంది సొంతంగా ప్రయత్నిస్తున్నారు.

* * *
లక్ష్మీనారాయణకు పిచ్చి అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అతని మానసిక వైకల్యం ఎప్పుడూ ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించలేదు. ‘పిచ్చోడా’ అని పిల్లలు వెక్కిరించినా అదోలా నవ్వుతాడే తప్ప ఎవరినీ ఏమీ అనడు. అలాంటి లక్ష్మీనారాయణ అమావాస్య రోజుల్లో మాత్రం రౌద్రంగా ఉంటాడు. కన్నెర్ర చేస్తాడు. పన్నెర్ర చేస్తాడు. నిద్రపోయినట్లే పోయి చటుక్కున లేస్తాడు. ‘‘ఎప్పుడూ శాంతంగా ఉండే నీ కొడుక్కి ఏమైంది ఇవ్వాళ’’ అని ఇరుగువారో పొరుగు వారో అడిగితే-
‘‘ఇవ్వాళ అమావాస్య కదా’’ అంటాడు వాళ్ల నాన్న.

* * *
మూడు రోజులుగా వాన జోరుగా కురుస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతం మలేరియా సోకిన రోగిలా గజగజ వణికి పోతోంది. ‘‘లంక గ్రామాల్లో చేరిన నీరు అలాగే ఉంది. ఎగువ నుంచి నీటిరాక తగ్గినప్పటికీ ఈ రోజు అమావాస్య కావడంతో సముద్రం నీటిని లాక్కునే పరిస్థితి కనిపించడం లేదు. చాలా గ్రామాలు ముంపునీటిలోనే ఉన్నాయి’’ అని టీవీ యాంకరయ్య ఫుల్‌స్టాప్, కామాలు లేకుండా చెప్పుకుంటూ పోతున్నాడు.
అమావాస్య రోజు సముద్రం నీటిని లాక్కోదా?!

* * *
అవావాస్య రోజు ఏమిటీ విపరీతాలు? అమావాస్య మంచిరోజు కాదా? భయానికి చీకటి సంకేతమైనట్లే, అమావాస్యకు అరుపులు, అవాంఛనీయమైన పరిణామాలు సంకేతమా? ‘అమావాస్య రేయి అలా ఆగిపోయి…’ అని ఆశాదీపం వెలిగించుకోవడానికి కారణం… అమావాస్య అంటే మనలో ఉండే భయమే కారణమా?! ఖండించడమా, ఆమోదించడమా? అనుభవాలే చెబుతాయి.

అమావాస్య రోజు ఆకాశం నల్లగా ఉంటుంది. ఆ నలుపు ఆక్రోశానికి, నిరసనకు ప్రతీక. సముద్రం కల్లోలంగా ఉంటుంది. ప్రేమ నిరాకరించబడిన స్ర్తీ హృదయపు వేదనే ఆ భయానకమైన కల్లోలం. కుక్కలు అర్ధరాత్రి సమయంలో ఆకాశం వైపు చూస్తూ వింత స్వరంతో రోదిస్తుంటాయి. మానవమాత్రులకు అది జంతువుల ఏడుపు మాత్రమే. కొందరు తాత్వికశిఖామణులకు మాత్రం ఆ రోదనలో పాతగాయాల దుఃఖం సజీవంగా కనిపించింది. మనిషి ప్రతి చేష్టకు సంకల్పితంగానో, అసంకల్పితంగానో అర్థం, పరమార్థం ఉన్నట్లే ప్రకృతిలోని ప్రతి కదలికకు అదే అర్థం, పరమార్థం ఉంటుంది.

విరహప్రేమికులు లంకపాలెం అమ్మాయి మాదిరిగా ఏ అర్ధరాత్రో‘వో…’ అని పెద్దగా అరవవచ్చు. అణచివేసుకున్న కోరిక, అదుపులో పెట్టుకున్న ఓపిక కట్టలు తెగిపోయి లక్ష్మీనారాయణ మాదిరిగా వెల్లువెత్తిన ఆగ్రహజ్వాల కావొచ్చు. ముంపు బాధిత గ్రామాలు సముద్రుడి వైపు దీనంగా చూడవచ్చు. ప్రయాణాల్లో అపస్వరాలు వినిపించవచ్చు. మీరు ఈసారి అమావాస్య రోజున ఆకాశాన్ని సుమారు అయిదు నిమిషాల పాటు ఏకాగ్రచిత్తంతో అదే పనిగా చూడండి. ఒక స్ర్తీ కనిపిస్తుంది. రోదన వినిపిస్తుంది.
‘‘నిన్ను ప్రేమించాను…’’ అనే భయానకమైన శబ్దం మార్మికంగా వినిపిస్తుంది. లోకం దృష్టిలో ఆమె ప్రేమ తప్పు కావచ్చు. తనకు మాత్రం ఒప్పు కావచ్చు. తప్పొప్పుల సంగతి అలా ఉంచితే ‘నిరాకరణ’ ‘భగ్నప్రేమ’ నుంచి వచ్చిన ప్రతికూల శక్తులు ‘అమావాస్య’ రూపంలో భయపెడతాయేమో!
అందుకే ఆరోజు ఏది చేసినా అశుభం అంటారు. ప్రయాణాలకు ససేమిరా అంటారు. ముగ్గులు వేయకూడదంటారు. అదిగో ఈ అమవాస్య రోజున కూడా ఎవరో ఒక అమ్మాయి పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది.
భగ్నప్రేమేనంటారా?!
మీరేమైనా నమ్ముతారా!!
– పాషా

అమావాస్య వెనక ఉన్న కథ
ప్రేమలో పిచ్చి ఉంటుంది. పిచ్చిలో ప్రేమ ఉంటుంది. ప్రేమ, పిచ్చి ఏకమై ఒకే స్వరమై అలిగి, చెలరేగిన పురాగాథ ఒకటి తెలుసా? ఇంతకీ అమావాస్యకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అమావాస్య అంటే చిమ్మచీకటి మాత్రమే కాదు. చీకటిలాంటి నిరాశ. విరహవేదన నుంచి ఘనీభవించిన రాత్రి.
మత్స్యపురాణం పద్నాలుగో అధ్యాయంలో అమవాస్య కథ ఉంది. పితృదేవతలకు అమావాస్య అంటే చాలా ఇష్టం. వీరు ఏడు గణాలుగా ఉంటారు. వీరిలో మూడు గణాల వారికి ఆకారం ఉండదు.

వారిని వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అంటారు. సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యవులు, సోమపులు అనే నాలుగు గణాలకు మాత్రం ఆకారం ఉంటుంది. ఈ ఏడుగణాలు ప్రాణులకు చైతన్యధారలు. అగ్నిష్వాత్తుల ముద్దుల కూతురు అచ్చోద. ఈవిడను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. అచ్చోద నదిరూపంలో ఉండేది. ‘మావసుడు’ అనే పితరుడు చూడగానే ఆకట్టుకునే అందగాడు. సౌమ్యుడు. అలాంటి మావసుడిని చూసి అచ్చోద మనసు పారేసుకుంది. ‘‘పెద్దలారా, చేసుకుంటే మావసుడినే పెళ్లి చేసుకుంటాను’’ అని పితృదేవతలతో చెప్పింది అచ్చోద. వావి వరసలు మరిచిన అచ్చోద ప్రేమ గురించి విని పితృదేవతలు ఆశ్చర్యపోయారు. వాళ్ల కాళ్లకింద భూమి కదిలినట్లయింది. మావసుడిని ప్రేమించిన కారణంగా అచ్చోద యోగశక్తి, దివ్యత్వాన్ని కోల్పోయింది. మావసుడు మాత్రం ఇంద్రియనిగ్రహంతో, విచక్షణ ఎరిగిన వాడై అచ్చోద ప్రేమలో పడలేదు. అచ్చోద మావస్య ప్రేమను దక్కించుకోలేదు. అతని చేత తిరస్కరించబడింది. ఈ కారణంగా అచ్చోద అమావాస్య అయింది.

అమావాస్య అంటే మావసుడి ప్రియురాలు కానిది అని.
కాలక్రమంలో అచ్చోద పేరు అమావాస్యగా స్థిరపడింది.

*
*
**జీవితం
ఓ ఫిలాసఫీ ప్రొఫెసర్ తరగతి బల్ల మీద కొన్ని వస్తువులతో నిలుచుని ఉన్నాడు.
విద్యార్థులు మౌనంగా, ఆయన చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నారు.
కొన్ని క్షణాల తర్వాత, ప్రొఫెసర్ తను తెచ్చిన వస్తువుల్లోంచి ఓ పెద్ద ఖాళీ గాజు
జాడీని, కొన్ని గోల్ఫ్ బంతులని బయటకి తీసారు. గోల్ఫ్ బంతులని ఒక్కొక్కటిగా
జాడీలోకి జారవిడిచారు. క్లాసంతా నిశ్శబ్దం.
జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.
పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.
అప్పుడు ప్రొఫెసర్ తను తెచ్చిన గులకరాళ్ళ కవరు విప్పి, వాటిని కూడా జాడీలో
జారవిడిచారు. జాడీని కొద్దిగా కదిలించారు. గులక రాళ్ళన్ని గోల్ఫ్ బంతుల మధ్యకి,
అట్టడుగుకి చొచ్చుకుపోయాయి.
క్లాసంతా నిశ్శబ్దం.
జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.
పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.
తర్వాత ప్రొఫెసర్ ఓ పొట్లంలోంచి ఇసుకని తీసి జాడీలో ఒంపారు.అది జాడీలోకి
నిరాటంకంగా జారిపోయింది.
క్లాసంతా నిశ్శబ్దం.
జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు.
“నిండింది” అంటూ విద్యార్థులు ఒకే గొంతుతో అరిచారు.
అప్పుడు ప్రొఫెసర్ అప్పటి దాక మూత పెట్టి ఉన్న రెండు కాఫీ కప్పులని దగ్గరికి
తీసుకున్నారు. వాటి మీది మూతలను తీసి, కాఫీని జాడీలోకి వొంపారు. ఇసుక రేణువుల
మధ్య ఉందే ఖాళీ స్థలంలోకి కాఫీ సులువుగా జారుకుంది.
ఈ చర్యకి విద్యార్థులు విరగబడి నవ్వారు.
నవ్వులు సర్దుమణిగాకా, ప్రొఫెసర్ ఇలా అన్నారు –
“ఈ జాడీ మీ జీవితాన్ని ప్రతిబింబిస్తోందని గ్రహించండి.
గోల్ఫ్ బంతులు ముఖ్యమైనవి – దేవుడు, కుటుంబం, మీ పిల్లలు, మీ అరోగ్యం,
స్నేహితులు, ఇంకా మీకు అత్యంత ప్రీతిపత్రమైన అంశాలు! మీ సిరిసంపదలన్నీ పోయినా,
ఇవి మీతో ఉంటే మీ జీవితం పరిపూర్ణంగానే ఉన్నట్లే.
గులక రాళ్ళు – మీ ఉద్యోగం, సొంతిల్లు, కారు వంటివి.
ఇసుక – అన్ని చోట్ల ఉండే చిన్న, చితక విషయాలు.
మీరు జాడీని ముందుగా ఇసుకతో నింపేస్తే, గోల్ఫ్ బంతులకి, గులక రాళ్ళకి అందులో
చోటుండదు.
జీవితంలో కూడ ఇంతే –
ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాలకి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ, అసలైన,
ముఖ్యమైనవాటిని విస్మరిస్తూంటాం.
సంతోషం కలిగించే వాటిపై దృష్టి నిలపండి.
మీ పిల్లలతో ఆడుకోండి.
మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
అప్పుడప్పుడు మీ జీవిత భాగస్వామిని బయట డిన్నర్‌కి తీసుకెళ్ళండి.
మీ 18 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నారో, అంతే ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపండి.
ఇంటిని శుభ్రం చేసుకోడానికి, నిరుపయోగమైన వాటిని వదుల్చుకోడానికి ఎప్పుడూ సమయం
ఉంటుంది.
గోల్ఫ్ బంతుల వంటి ముఖ్యమైన అంశాలపై ముందు దృష్టి పెట్టండి. ప్రాధాన్యతలు
నిర్ణయించుకోండి. మిగిలేదంతా ఇసుకే” –
క్లాసంతా నిశ్శబ్దం.
ఇంతలో ఒక కుర్రాడు తనకో సందేహమన్నట్లు చెయ్యెత్తి, “మరి కాఫీ దేనికి
ప్రతిరూపం?” అని అడిగాడు.
“శభాష్, ఈ ప్రశ్న అడింగందుకు నాకు సంతోషంగా ఉంది.
“మీ జీవితం దేనితో నిండిపోయినా, మిత్రుడితో ఓ కప్పు కాఫీకి ఎప్పుడు అవకాశం
ఉంటుంది” అంటూ ప్రొఫెసర్ క్లాస్ ముగించి వెళ్ళిపోయారు

Story of Mother

blog viewers, నాదొక విన్నపం..
PS:ఒక వెబ్‌సైటులో నేను చదివిన ఆంగ్లకథకు స్వేచ్చానువాదం.
Disclaimer: ఇది నా జీవిత కథ కాదు. దయచేసి నాపై ఎవరూ కోపగించుకోవద్దు

ఓ అమ్మ కథ…
మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె
ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు
నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి
స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని
స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.

అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు
పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా
అదృశ్యమైపోతే బావుణ్ణు.

“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన
అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి. ఆమె మొహంలో
నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది.
అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా
ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ
పెట్టానో నాకు తెలియదు.

ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో
దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ
అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు.
నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను.

ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని
తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు
సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.
ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి
వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను.
బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి
పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా
సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ
లేదుకదా!

అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది
మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు
భయంతో జడుసుకుంది. “ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు
తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందు నువ్వెళ్ళిపో
ఇక్కడ్నుంచి!!!” సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.

“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె
అదృశ్యమైపోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి
పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు
అనుకున్నాను.

కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక
ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి
అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన
తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి
భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో
ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం.
ప్రియమైన కుమారునికి,

ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే
దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం
చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక
పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని
తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్
దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసినదాన్నవుతాను. ఒక్క విషయం
మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా
ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన
నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు
పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా
ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క
రెండు సార్లు మాత్రం ” వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా
కదా!” అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా
హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు.

ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు.నవనాడులూ
కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి
వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని
కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి ఆమె ఋణం తీర్చుకోను?

PS:ఒక వెబ్‌సైటులో నేను చదివిన ఆంగ్లకథకు స్వేచ్చానువాదం.
Disclaimer: ఇది నా జీవిత కథ కాదు. దయచేసి నాపై ఎవరూ కోపగించుకోవద్దు

పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి , నిన్ను పూజించిన నీ రుణము తీరునా
అమ్మా ఆ……….నీకు వందనాలమ్మ!
AJAY

Advertisements
Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s